•కర్ణాటక సంగీతం•
.
.
భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శైలి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశం లో కానవస్తే ఈ సంగీతం భారత ఉపఖండంలో ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో కానవస్తుంది. హిందుస్థానీ సంగీతం పర్షియన్ మరియు ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
.
భారతీయ సంప్రదాయంలోని అన్ని కళలలాగే కర్నాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల మరియు పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతి లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
.
--------------------------------------------------------------------------------------------------------------
“వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి”
--------------------------------------------------------------------------------------------------------------
.
.
.
నేటి కర్ణాటక సంగీతానికి స్వరరాగతాళములే ఆధారములని ,ప్రాచీన గ్రంథాలైన శిలప్పాధికారం మరియు భరతుని నాట్యశాస్త్రంలో వివరించబడింది.
.
క్రీ.శ 12వ శతాబ్దం వరకూ భారతదేశమంతటా ఒకే రకమైన సాంప్రదాయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేది. తరువాత ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు టర్కీ, మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం పరిపాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వీరు క్రీ.శ. 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు పరిపాలించారు. వీరి కాలంలో ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయ సంగీతం పర్షియన్ కళలచే విపరీతంగా ప్రభావితమైంది. 14 వశతాబ్దం వచ్చే సరికి ఈ సాంప్రదాయ సంగీతం, హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతం అని రెండుగా చీలిపోయాయి. 18 శతాబ్దం నుంచీ, 20 వ శతాబ్దం వరకూ ఈ సంగీతాన్ని మైసూర్ మహారాజులు, ట్రావెంకూర్ మహరాజులు ఎక్కువగా ఆదరించి పోషించారు. వేంకటమఖి మేళకర్త రాగాల వర్గీకరణ పద్ధతిని కనుగొని, దానిని తన సంస్కృత గ్రంథం, "చతుర్దండి ప్రకాశిక"లో పొందు పరిచాడు. నేడు వాడుకలో నున్న సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను తయారు చేసింది గోవిందాచార్య. ట్రావెంకూర్ మరియు మైసూర్ రాజులు ,సంగీతకర్తలే కాక, వీణ, రుద్రవీణ, వేణువు, వయొలిన్, ఘటం, మృదంగం వంటి వాయిద్యాలలో నిష్ణాతులు. వారి ఆస్థాన సంగీత విద్వాంసులలో పేరెన్నిక గన్నవారు వీణా శేషన్న (1852 - 1926) మరియు వీణా సుబ్బన్న (1861 - 1939) లు.
.
స్వాతంత్ర్యానంతరం ,కర్ణాటక సంగీతం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గాయకులు సభల్లో పాడేవారు. శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని వినేవారు.అలా మద్రాసు కర్ణాటక సంగీత కేంద్ర బిందువుగా వెలసింది. ప్రస్తుతం ఈ సంగీతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకోదగ్గ స్థాయిలో దక్షిణ భారతీయులు నివసిస్తూ ఉంటే అక్కడ కూడా ఇది తప్పక వారి జీవనంలో భాగంగా ఉంటుంది. ప్రతీ యేటా చెన్నై లో డిసెంబరు మరియు జనవరి మధ్యలో జరిగే కర్ణాటక సంగీత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలలనుంచీ కళాకారులు విశేషంగా హాజరవుతారు.
.
.
పురందర దాసు (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు.
.
ఈ సంగీతాన్ని బోధించడానికి పురందరదాసు కొన్ని పద్దతులు ఏర్పరచాడు. దీని ప్రకారం ముందుగా వరుసలు నేర్పిస్తారు. తరువాత అలంకారాలు, గీతాలు (సులభమైన పాటలు), స్వరజతులు నేర్పించబడతాయి. విద్యార్థి ఒక దశ చేరుకున్న తర్వాత వర్ణాలు, కృతులు బోధిస్తారు. సాధారణంగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వడానికి ఒక విద్యార్థికి కొన్ని ఏళ్ళ కాలం అవసరమౌతుంది. ఈ సంగీతాన్ని మొదటి సారిగా నేర్చుకునే వారికి మాయా మాళవ గౌళ రాగాన్ని నేర్పిస్తారు. ఇదిసంగీతంలో తొలి అడుగులు వేసేవారికి అనుకూలంగా ఉంటుందని పురంధర దాసు ప్రకటించాడు.
.
బోధనా పద్దతులు, ఉపకరణాలు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలలోనూ ఒకే విధంగా ఉంటాయి. అభ్యాసం సరళీ వరుసలతో ప్రారంభమై, క్రమంగా క్లిష్టమైన అంశాలకు మళ్ళుతుంది. సాంప్రదాయకంగా ఈ సంగీతాన్ని గురుకుల విద్యా విధానం లోనే బోధించే వారు. కానీ 20వ శతాబ్దం మలి భాగం నుంచీ ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు సంభవించడంతో, ఈ సంగీతాన్ని నేర్చుకోదలచిన పిల్లలు, దీనికి సమాంతరంగా మరో విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాల్సి రావడంతో గురుకుల విధానం ప్రాచుర్యాన్ని కోల్పోయింది.
.
.