•నాట్యమునందు సంగీతం•
నాట్యమునందు సంగీతము
దక్షిణ భారతదేశమందు ఖ్యాతినొందిన శాస్త్రీయ నృత్యములగు భరత నాట్యము, కూచిపూడి, మొదలగునవి కర్ణాటక సంగీతముపై మిక్కిలి ఆధారపడియున్నవి. తిల్లానా, పదము, జావళి, మొదలగునవి సంగీత కచేరీలయందును, నృత్య ప్రదర్శనలయందును ముఖ్య భాగములుగా పరిగణింపబడుచున్నవి. నృత్యమున ఉపయుక్తములగు కృతులు నృత్తమునకు, అభినయమునకు అనుగుణముగా మార్పు చేయబడును అనగా, కాల భేదము చూపబడును.
నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది. ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. నాట్యం 4 విధాలైన అభినయాలతో కూడి ఉండును. నృత్తమందలి అంగ విన్యాసమును, నాట్యమందలి అభినయమును కలిపినచో 'నృత్యం' అగును. భరతుడే ఈ సమ్మేళనం చేసినట్లు అభిప్రాయమున్నది. నృత్తం మొదట జనించినది. తరువాతిది నాట్యం. ఈ రెండింటి సమ్మేళనమే నృత్యం. క్రీ.శ. 4వ శతాబ్దికి చెందిన అమరసింహుడు తాండవ-నటన-నాట్య-లాస్య-నర్తనములు పర్యాయ పదములని తెలిపినాడు. కావున క్రీ.శ.4వ శతాబ్ది నాటికే నృత్యము ప్రచారంలో ఉందని, నాట్య-నృత్యములు పర్యాయ పదాలని గ్రహించవచ్చు.
నృత్తమునందు తాండవ-లాస్యమనే భేదాలు కలవు. నృత్తము ఉద్ధతముగ ఉన్నచో తాండవమని, సుకుమారముగా ఉన్నచో లాస్యము అని అంటారు. నాట్యమునందు కనిపించని జ్ఞానముగానీ, శిల్పముగానీ, విద్యగానీ, కళగానీ, యోగముగానీ, కర్మగానీ లేనే లేదు. సర్వ శాస్త్రములు, సర్వ శిల్పములు, వివిధములైన కర్మలు ఈ నాట్యమందు కూడియున్నవి. ఇది హితమును, యశస్సును, ఆయువును, బుద్ధి వికాసమును కల్గించును. దీనులకు విశ్రాంతి కల్గించును. నాట్య వేదము, నాట్య శాస్త్రము అనునవి పర్యాయ పదములు. వేదమనగా జ్ఞానము. శాస్త్రమనగా శాసనోపాయము. నాలుగు వేదాల నుండి 4 నాట్యాంగాలను బ్రహ్మ గ్రహించి నాట్య వేదమును నిర్మించాడు. ఋగ్వేదం నుంది పాఠ్యాన్నీ, యజుర్వేదం నుండి అభినయాన్నీ, సామవేదం నుండి సంగీతాన్నీ, అధర్వ వేదం నుండి రసాన్నీ గ్రహించి ఈ నాట్య వేదాన్ని సృష్టించాడు. నాట్య వేదాన్ని పంచమ వేదం అని కూడా అంటారు. ఆంగికం, వాచికం, ఆహార్యం మరియు సాత్వికం అను నాలుగు ఉపాంగాలు ఈ నాట్యానికి ప్రాణం.
నాట్యము అనే పదం కేవలం నృత్యమునకు సంబంధించినదనే అభిప్రాయం ఉంది. కాని నాట్యమంటే దశ రూపకమని అర్ధం.
దశ రూపకాలు :
1) నాటకం
2) ప్రకరణం
3) సమపకారము
4) ఈహామృగము
5) ఉమము
6) వ్యాయోగము
7) అంకము (ఉత్సృష్టికాంకము)
8) ప్రహసనము
9) భాణము
10)
వీధి
ఈ పది రూపకాలు కలసిన కళయే నాట్యము. ముఖ్యంగా ప్రయోగానికి ఉద్దేశింపబడిన రూపకమే నాట్యం అని స్పష్టంగా చెప్పవచ్చు.
నాట్య శాస్త్రంలోని మొత్తం 11 విషయాల వివరణ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అవి :
1) రసములు
2) భావములు
3) అభినయములు
4) ధర్ములు
5) వృత్తులు
6) ప్రవృత్తులు
7) సిద్ధులు
8) స్వరములు
9) ఆతోద్యములు
10) గానములు
11) రంగములు
1. రసము : నాట్యం రసప్రధానమైనది. ఇవి 9. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత రసాలు. నాట్య శాస్త్ర రచయిత భరతుడు రసములు 8 మాత్రమే అని పేర్కొనగా ఉద్భటుడు 9 అనీ, శాంతము తొమ్మిదవ రసమని తెలిపాడు. ఆస్వాదించబడుతోంది కావున అది రసమనబడుచున్నది.
2. భావములు : ఇవి మొత్తం 49. ఇందులో స్థాయీ భావాలు 8, సాత్విక భావాలు 8, సంచారి (వ్యభిచారి) భావాలు 33. ఆంగిక, వాచిక, సాత్వికాభినయోపేతములైన రసములను భావింపజేయునవికాన ఇవి భావములనబడినవి.
3. అభినయములు : ఇవి ఆంగికం (శారీరాభినయం), వాచికం (వాగాభినయం), ఆహార్యం (అంగ రచనము, వస్త్ర-భూషాదిధారణము), సాత్వికం (సత్వసంబంధమైన అభినయం) అను 4 విధములు.
4. ధర్ములు : ధర్మి అంటే అభినయ విధానము. ఇది రెండు విధాలు. 1) లోక ధర్మి, 2) నాట్య ధర్మి.స్త్రీ పాత్రలను ప్రయోగించుటకు స్త్రీలను, పురుష పాత్రలను పోషించుటకు పురుషులను కలిగిన నాట్యము లోకధర్మి అనబడును. స్త్రీ పాత్రను పురుషుడుకానీ, పురుష పాత్రను స్త్రీగానీ ప్రయోగించవలసివచ్చినచో అది నాట్యధర్మి అనబడును.
5. వృత్తులు : ఇవి నాట్యానికి మాతృకలు. ఇవి భారతి, సాత్వతి, కైశికి, అరభటి అను 4. ఈ నాలుగు వృత్తులయందే నాట్యము ప్రతిష్ఠితమై ఉంది.
6. ప్రవృత్తులు : ఇవి ఆయా దేశ వేష ఆచారాదులు. పృధ్విలోని వివిధ దేశములందలి వేష-భషా-ఆచార-వార్తలను బాగుగా తెలియజేయునది గావున ఇది ప్రవృత్తి అనబడింది. ఇవి అవంతి, దాక్షిణాత్య, ఓఢ్రమాగధి, పాంచాలమధ్యమ అను నాలుగు.
7. సిద్ధులు (Success) : సిద్ధి అంటే నాట్యం జయప్రదమగుట. ఇది దైవికి, మానుషి అను రెండు విధములు. ఇందులో దైవికి ఉత్తమమైనది. మానుషి సామాన్యమైనది.
8. స్వరములు : ఇవి షడ్జమం, నిషాదం, ఋషభం, గాంధారం, మధ్యమం, పంచమం మరియు దైవతం అను ఏడు.
9. ఆతోద్యములు : ఇవి వాద్యములు. ఇవి నాలుగు విధాలు. ఇవి తతము (తంత్రగతము = వీణ), అవనద్ధము (చర్మముచే మూయబడిన మద్దెల), ఘనము (కంచు తాళములు), సుషిరము (వేణువు) మొదలైనవి.
10. గానములు : ఇవి ప్రవేశ గానము, ప్రసాద గానము, ఆక్షేప గానము, అంతర గానము, నిష్క్రామ గానము అను 5 విధములు.
11. రంగములు : ఇవి చతురశ్రము, వికృష్టము, త్ర్యశ్రము అని మూడు విధాలు.
ఈ 11 విషయముల స్వరూపమే నాట్య వేద సంగ్రహము.
చందస్సు : వాక్కు నాట్యమునకు తనువు. కావున దీనిని గూర్చి అధిక శ్రద్ధ తీసుకోవలెను.
తంజావూరు రాజగు శరభోజి (క్రీ.శ.1798-1824) పరిపాలనా కాలంలో ఇది ఆరంభమయ్యింది. శరభోజి మహారాజు ఆస్థాన నర్తకులగు
పొన్నెయ్య
చిన్నయ్య
వడివేలు
శివానందం
అను నలుగురు సోదరులు దీనికి పితామహులుగా చెప్పబడుతున్నారు. వీరు నాట్యమునందు అలరిపు, జతిస్వరము, శబ్దము, వర్ణము, పదము, తిల్లాన అను క్రమమును ఏర్పరచి దానిని సువ్యవస్థితము చేశారు. భరత నాట్యానికి ఉపయుక్తమగు గీతాలు తెలుగు భాషలోవే అవడం గమనార్హం.
సుప్రసిద్ధ నృత్య భేదములు: కూచిపూడి నాట్యం, భరతనాట్యం, కథాకళి, కథక్, మణిపురి నృత్యాలు భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన నృత్య సంప్రదాయాలు. ఇవి అన్నీ మార్గ నృత్యభేదాలు. కూచిపూడి, భరతనాట్యాలు భరతుని నాట్య శాస్త్రమునుండే గ్రగింపబడినవి. వీటిలో కూచిపూడి అత్యంత ప్రాచీనమైనది.
కూచిపూడి నాట్యం : దీనికే కూచిపూడి భాగవతం అని పేరు. కూచిపూడి నాట్యం 16వ శతాబ్ధి నాటికే ఉందని క్రీ.శ. 1506 నాటి మచ్చుపల్లి కైఫీయతు తెలుపుతుంది. విజయనగర ప్రభువగు వీరనరసింహ రాయల యెదుట సిద్ధవటం సీమను పరిపాలిస్తున్న సమ్మెట గురవరాజు చేస్తున్న దారుణ కృత్యాలను ఈ భాగవతులు కేళిక మధ్యలో ప్రదర్శించి వీరనరసింహ రాయల వారి దృష్టినాకర్షించి, ఆయన కళ్ళు తెరిచేట్లు చేసినట్లు ఈ కైఫీయతులో ఉంది. ఈ నాట్యం మొదట్లో దేవదాసీలు చేసేవారు. నాటి సమాజంలోని పెద్దల దుష్క్రుతుల వల్ల దేవదాసీ వ్యవస్థ విధానం మారిపోవడంతో దేవదాసీలనగా వేశ్యలు అనే పేరుపడిపోవడంతో ఈ నాట్యానికి గ్రహణంపట్టింది. 14వ శతాబ్ది ప్రారంభంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి బ్రాహ్మణులకు నృత్య కళను నేర్పాడు. దానినే పారిజాతము లేదా భామాకలాపము అంటారు. దానిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేశాడు.ఇది నాట్య మేళ సంప్రదాయానికి చెందింది. ఈ నాట్యాన్ని ఒకప్పుడు పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు. ఆనక స్త్రీలు కూడా ఈ నాట్య ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. ఈ నాట్యంలో జడకు అధిక ప్రాధాన్యం ఉంది. జడలోని 27 చిన్న బిళ్ళలు నక్షత్రాలకు ప్రతీకలు. వినాయక కౌత్వం, పూజా నృత్యం, జతి స్వరం, శబ్దం, తరంగం, వర్ణం, పదాలు, జావళీలు, కీర్తనలు, తిల్లానలు ఇందులో ప్రదర్శించబడతాయి. అర్ధనారీశ్వర నృత్యం కూచిపూడి నృత్యంలోతప్ప మరే నృత్యంలోనూ ప్రదర్శించరు. తాళ చిత్ర నాట్యం (నర్తకి తన కాళ్ళతో నాట్యం చేస్తూ బొమ్మలు వేయడం), విప్రలంగ శృంగారం (సత్యభామా కలాపం), బాలగోపాల తరంగం (ఇత్తడి పళ్ళెం అంచులపై నృత్యం) మొదలైనవి ఈ నాట్య ముఖ్య లక్షణాలు. ఉషా పరిణయం, పారిజాతాపహరణం, గిరిజా కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, మేనకా విశ్వామిత్ర, హరవిలాసం మొదలగునవె ఈ నట్యంలోని ప్రసిద్ధి చెందిన రూపకాలు.
భరతనాట్యం : భరతమనగా భావ, రాగ, తాళముల సమ్మేళనము కలిగినదని అర్ధము. దీనిని 'దాసి అట్టం' మరియి 'సాదిర్'గా పిలుస్తారు. తంజావూరు రాజగు శరభోజి (క్రీ.శ.1798-1824) పరిపాలనా కాలంలో ఇది ఆరంభమయ్యింది. శరభోజి మహారాజు ఆస్థాన నర్తకులగు పొన్నెయ్య, చిన్నయ్య, వడివేలు, శివానందం అను నలుగురు సోదరులు దీనికి పితామహులు. వీరు నాట్యమునందు అలరిపు, జతిస్వరము, శబ్దము, వర్ణము, పదము, తిల్లాన అను క్రమమును ఏర్పరచి దానిని సువ్యవస్థితము చేశారు. భరత నాట్యానికి ఉపయుక్తమగు గీతాలు తెలుగు భాషలోవే అగుట గమనార్హం. భరతనాట్యంలో నాలుగు రకాల శైలులున్నాయి. 1. తంజావూరు శైలి, 2. పందనల్లూరు శైలి, 3. వళువూరు శైలి, 4. మైసూరు శైలి. ఈ నాట్యాన్ని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని అనుసరించి ప్రదర్శిస్తారు.
కథాకళి : ఈ నృత్యమునకు కొత్తరక్కర రాజు (క్రీ.శ,1575-1650) మూలపురుషుడని చెప్పుదురు. తక్కిన భారతీయ నాట్యములు నాట్య శాస్త్రము లేదా అభినయ దర్పణమును అనుసరించుచుండగా కథాకళి మాత్రము హస్తలక్షణ ఎంపికను అనుసరించుచున్నది. ఇది మలబారు ప్రాంతానికి చెందినది. దీనిని ఉద్ధత నృత్యంగా పేర్కొనవచ్చు. ఇందులో వాచికము అప్రధానమై ఆంగికాభినయం ప్రాధాన్యమును వహించును. కథాకళికి మూలము భరతనాట్య శాస్త్రమే అయినప్పటికీ వారు దానియందు అనేక మార్పులు చేసి ఒక ప్రత్యేక శాస్త్రాన్ని రూపొందించుకున్నారు. కథాకళిని నృత్య నాటకంగా పేర్కొనవచ్చు.
కథక్ : ఇది హిందు-మొఘలాయ్ కళా సమ్మేళనము. ఉత్తర భారతదేశంలో ఇది విస్తృత ప్రచారంలో ఉంది. భరతనాట్యమందు హస్తాభినయం ప్రధానం కాగా కథక్యందు పాద ప్రచారం ప్రధానము. ఇందులో అర్ధమునకు ప్రాధాన్యము లేదు. తాళగతి ఇందులో పరాకాష్టనందినదనిచెప్పవచ్చు. ఆలయాల్లో చెప్పే కథల నుంచి ఈ నృత్యం ప్రాణం పోసుకుంది. ఈ నాట్యం తన తాళ క్రమాన్ని హిందుస్థాని సంగీతం నుంచి గ్రహించింది. 'ఘరానాలు' కథక్లోని ప్రత్యేకత. లక్నో, జైపూర్, రాయ్గఢ్, గ్వాలియర్ ఘరానాలు ప్రసిద్ధిచెందినవి. ఈ నృత్య రీతిలో రాధాకృష్ణుల దివ్య నృత్యం ప్రధానాంశం. నర్తకలు చేసే భ్రమణాలను 'చక్కర్లు' అంటారు. లయబద్ధంగా, తాళానుగుణంగా చేసే పద విన్యాసం 'తత్కాఋ ఈ నృత్యానికి ప్రాణం. 16వ శతాబ్దికి చెందిన రాజస్థానీ చిత్రకళలో కనిపిస్తున్న వివిధ భంగిమలు ఈ నాట్య ఆవిర్భావానికి కారణం.
మణిపురి : ఇది భక్తుల భక్త్యావేశానికి సంబంధించిన శాస్త్రము. అస్సాం, బెంగాల్లలో ప్రచారంలో ఉన్నది. ఇందులో శాస్త్రం కంటే లోకమే అధిక ప్రాధాన్యము వహించును. చైతన్యుని వైష్ణవంతో ఇది ఎక్కువ ప్రచారాన్ని పొందినదని చెప్పవచ్చు. ఇది లాస్య ప్రధానమైన నృత్యము.
సంగీతంలో రకాలు సంగీతమందు గల భిన్న సంప్రదాయములు భారతీయ సంగీతము అనేక సంప్రదాయ రీతులలో భాసిల్లుచున్నది. ఏ సంగీతమైనా ముందుగా జానపదుల మధ్య పుటు ్టకొస్తుంది. వారి నిత్య జీవితంలో భాగంగా, వారి శ్రమ జీవనానికి అనుకూలంగా తాళ లయలతో, నంతోషాది రసాలనిముడ్చుకుని ప్రకృతి ప్రభావాలకు లోనవుతూ ఆవిర్భవిస్తుంది. అది పెరిగి, వ్యాప్తిచెంది జన జీవనంలో ఒక భాగమైపోతుంది. దీనిని పండితులు సంస్కరించి, మార్గాన్ని నిర్ణయించి మార్గ పద్ధతిగా మలుస్తారు. మన సంగీతము ను, నృత్యాలన్నీ యిలా పుట్టి, యిలాగే పరిణతి చెందాయి.మనకున్న అనేక గ్రామ దేవతల ముందు పాడే భజనలు, ఆరాధన పాటలు, ఆడే నృత్యాలు కొలువులలో, ఆరాధనలలో మనం చూస్తుంటాము. ఈ విధం గా సంగీతం నృత్యం తో మమేకమై మన నిత్య జీవితాన్ని రసమయం చేస్తుంది.. అటువంటి రసాస్వాదన నుంది పుట్టిన సంగీత నృత్య కలియిక యే ఈ నాట్యమందు సంగీతం.