•బుర్ర కథలు•
బుర్రకథ పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.
ఒక కళారూపము
తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిలో (ఫక్) బుర్ర ఆకారంలో ఉన్న వాయిద్యం వల్ల దీనికి బుర్రకథ అనే పేరు వచ్చినది. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం. ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.
1.
జంగంకథ
2.
పంబలకథ
3.
జముకులకథ
4.
పిచ్చుకుంట్ల కథ
తరువాతవచ్చింది. డాలు, కత్తి తో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు. దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్ నాజర్. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్ తానే కథారచనకూ నడుంబిగించాడు. అంతేకాదు సామ్యవాద దృక్పధం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. నాజర్ బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం బెంగాల్ కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది.
ప్రదర్శనా విధానం
వినరా భారత వీరకుమారా విజయం మనదేరా అన్న చరణం బుర్రకథల్లో సర్వ సామాన్యం. బుర్రకథ ఎక్కువగా ముగ్గురు ప్రదర్శకులతో నిర్వహించబడుతుంది. దానికి వంతగా ప్రక్కనున్న ఇద్దరు తందాన తానా అని వంత పాడతారు. అందుకే దీనిని తందాన కథ అని కూడ అంటారు.
ఒకరు ప్రధాన కథకుడు: ముఖ్య కథను, వర్ణనలనూ, నీతినీ, వ్యాఖ్యలనూ రసవంతమైన మాటలు, పాటలు, పద్యాలలో తాళానికి అనుగుణంగా చెబుతూ ఉంటాడు. వారికి మాటా, ఆటా, పాటా బాగా తెలిసి ఉండాలి. ఇక కథ సంగతి సరేసరి. అతని (ఆమె) వేషధారణ కూడా రంగుల అంగరఖా, తలపాగా, నడుముగుడ్డ, ముత్యాల గొలుసు, కాలిగజ్జెలతో కనుల పండువుగా ఉంటుంది.
మరొకరు వంతు పాటగాడు,హాస్యగాడు. రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేత డప్పులతో వీరు కథకునికి పాటలోనూ, చిందులోనూ తోడుంటాడు. కథలో పట్టు నిలబెడుతుంటారు. ఏమైందని ప్రశ్నిస్తూంటాడు. ఉత్సాహాన్ని, ఊపును పంచుతుంటాడు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంటాడు. హాస్యాన్ని కూడా పంచుతూ ఉంటాడు. పిట్టకథలు చెప్తూ జోగుతున్న ప్రేక్షకులను లేపుతుంటాడు.
మూడవ వ్యక్తి హాస్యగాని అతితెలివికి అడ్డుకట్ట వేస్తుంటాడు. కథనూ, కథనాన్నీ, అందులో నీతినీ నొక్కి చెబుతూ అసలు కథను దారి మళ్ళనీయకుండా చూస్తూ ఉంటాడు.
కథావస్తువులు
బుర్రకథలలో కథావస్తువు కొరకు అనేక వనరులు ఉన్నాయి. అత్యధికంగా ఉపయోగించబడే వనరుల జాబితా.
1.
దేవతా కథలు
2.
పౌరాణికాలు
3.
జానపదాలు
4.
రాజకీయాలు
5.
చరిత్రకారులు
6.
ఉద్యమకారులు
7.
వివిధ రంగాలలో ప్రముఖులు
8.
పల్లె పట్టణ సమస్యలు ఇలా వివిధములు-
9.
బుర్రకథలో ప్రముఖులు
·
బుర్రకథ అనగానే షేక్ నాజర్ గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు. బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం. బొబ్బిలియుద్ధం బహుళ ప్రచారం పొందినవి.
·
కుమ్మరి మాస్టారు గా ప్రఖ్యాతి చెందిన దార అప్పలనారాయణ.
1.
పెండ్యాల వెంకటేశ్వరరావు
2.
పరుచూరి రామకోటయ్య
3.
సిరివిశెట్టి సుబ్బారావు
4.
ప్రమీల సిస్టర్స్
5.
కోసూరి పున్నయ్య
6.
గోవర్థన
7.
కాకుమాను సుబ్బారావు
8.
దావులూరు
9.
చింతల సూర్యనారాయణ
10. మోటూరి ఉదయం
11. చింతల కోటేశ్వరమ్మ
12. మహంకాళి లక్ష్మి
తదితర కళాకారులు బుర్రకథలకు వన్నె తెచ్చారు.
జన జీవనం
గుంటూరు జిల్లా, తెనాలి, మారీసుపేట వాస్తవ్యులైన ప్రమీల సిస్టర్స్ బుర్రకథ చెప్పడం లో అందెవేసిన కళాకారులు. శ్రీమతి చెన్ను ప్రమీల ప్రధాన కథకులు. వీరు జముకుల కథ కూడా ప్రతిభావంతంగా చెబుతారు. కన్యక, చెల్లి చంద్రమ్మ, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్దం, పల్నాటి చరిత్ర మొదలగు కథలను రసవత్తరంగా ప్రదర్శిస్తారు. వీరు ఆకాశవాణి, దూరదర్శన్ లో అనేక ప్రదర్శనలను ఇచ్చారు. శ్రీమతి చెన్ను ప్రమీల ప్రస్తుతం వరంగల్ జిల్లా,మామునూరు, జవహర్ నవోదయ విద్యాలయం లో సంగీతం అథ్యాపకులు గా పనిచేస్తున్నారు.