WORLD MUSIC. ENGLISH MUSIC. HINDI MUSIC. Mutyala Music Home Facebook Youtube

•హరి కథలు•

•హరి కథలు•



ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధ్రుల హరికథా చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. హరిలీల లను చెప్పే విధానమును హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత కలదు. నారదుడు మొదటి హరిదాసు అంటారు.దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వారు ఆదిభట్ల నారాయణదాసు గారు. బ్రహ్మశ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథ విద్వాంసులు మరియు అష్టభాషాపండితుడు. ఇది సంగీత, సాహిత్యాల మేలు కలయిక. ఈ కథ చెప్పువారిని భాగవతులు లేదా భాగవతార్ అని అందురు. ఆధునిక యుగంలో ఆదిభట్ల నారాయణదాసు, పరిమి సుబ్రమణ్యం భాగవతార్ మొదలగువారు ఈ ప్రక్రియలో ఆద్యులు.


హరి కథ


హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితోనృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో వున్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాల కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించ కుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళును ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరి కథను గానం చేస్తాడు.


హరికథకుని వేషధారణ


కథకుడు కేవలం అతని ప్రతిభవల్లనే ప్రేక్షకులను హరి కథతో రంజింప జేయగలడు. హరికథకుని వేషధారణ కూడ సామాన్యమే. చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు.


కట్టుకథలు కావు అచ్చంగా హరికథలే


హరికథకులు రామాయణం, భారతం, భావతం మొదలైన అధ్యాత్మిక సంబంధమైన కథలను విరివిగా చెపుతూ వుంటారు. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం మొదలైన కథలు వరుసగా పది హేను రోజులూ, నెలరోజుల వరకూ గూడా సాగుతాయి. పట్టణాలలోనూ గ్రామాల్లోనూ పనుల తరుణం అయ పోయిన తరువాతా, పర్వదినాలలోనూ ఆంధ్ర దేశపు హరిదాసులు ఈ కథలు చెపుతూ వుంటారు.


వివిధ భాషలలో హరికథ


హరికథా ప్రక్రియ ఇతర భారతీయ భాషలలోనూ ఉన్నది. తమిళుల కథాకాలక్షేపము సంగీత ప్రధానమైనది, కన్నడ హరికథ ప్రవచనాభరితమైనది, మరాఠీ కీర్తనలు భక్తి ప్రధానమైనవి. కానీ తెలుగు హరికథ భక్తి, సంగీత, సాహిత్య, అభినయాల మేలుకలయిక అని తూమాటి దోణప్ప వివరించాడు. 5వేలకు పైగా హరికథలు, హరికథపై 200 మందికి పైగా రచయితలు వ్రాసిన దాదాపు వెయ్యి పుస్తకాల వాజ్ఞ్మయము కలిగిన ఏకైక భాష తెలుగు.


హరికథ పుట్టుక


హరికథ పుట్టుక గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరికథ వేదాలనుండి పుట్టిందని కొందరు భావిస్తారు. జమ్మలమడక మాధవరాయశర్మ కథాగానము యొక్క మూలము సామగానమేనని అభిప్రాయం వెలిబుచ్చాడు. మరికొందరు లవకుశుల రామాయణ పారాయణము నుండే హరికథ ఉద్భవించిందని భావిస్తున్నారు. మరికొందరు నారద భక్తిసూత్రము హరికథ యొక్క మూలమని భావించారు. ఇంకొందరు యక్షగానమే హరికథగా రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. హరికథ మూలమేదైనా ఆంధ్రదేశములోని హరికథా ప్రక్రియ తన ప్రదర్శనలో వినూతనత్వములోను, నవరస సమ్మేళనం లోనూ, వివిధ రాగాలను పలికించటము లోనూ ప్రత్యేకమైనది.


హరికథల ప్రాచీనత


హరికథల స్వరూపం వేద కాలం నాటిదనీ, సర్వజ్ఞలయిన మహర్షులు ఈ హరి కథా శిల్పాన్ని ప్రప్రధమంగా సృష్టించారనీ పండితులు నిర్ణయించారు. బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ హరికథా గానం చేస్తూ వుంటాడని ప్రతీతి. వేద విభజన చేసినా, అష్టాదశ పురాణాలను లిఖించినా మనశ్శాంతి పొందనేరని శ్రీ వ్వాసునకి శ్రీ మద్భాగవతం రచించి హరికథామృధాన్ని పంచిపేదుటూ మానవోద్ధరణ గావింపునని నారదుడు ఆదేశించాడు. తరువాత శుకదేవుడు, సౌనకాది మహర్షులు, సూతుడూ హరికథా రూపకమైన ల్భాగవతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారని పాతూరి ప్రసన్నంగారు 1965 పిబ్రవరి నాట్యకళ ' సంచికలో వివరించారు.


రంగస్థలము, రంగైన ప్రదర్శనం


హరికథా ప్రథర్శనాలు రాత్రి పూటే జరుగుతూ వుంటాయి.( కానీ చిత్తూరు జిల్లాలో మహాభరతము ఉత్సవములో హరికతను పగటి పూట మాత్రమే జరుపుతారు. హరికథలోని ఆనాటి భాగాన్ని ఆరాత్రి నాటకముగా ప్రదర్శిస్తారు.) ఇవి ముఖ్యంగా, గణపతి నవరాత్రులు, దశరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వ దినాలలో విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ ప్రదర్శనానికి ఖర్చు చాల తక్కువ. ఒకే నాటి ప్రదర్శనమైతే, గ్రామం మధ్య పెద్ద బజారులో గాని, విశాలమైన మైదానంలో గాని ఒక చిన్న పందిరి వేసి పందిరిలో ఎత్తైన దిబ్బను గాని, చెక్కలతో చిన్న స్టేజిని నిర్మించి గానీ రెండు ప్రక్కలా కాంతి వంతమైన పెట్రో మాక్సు లైట్లను అమరుస్తారు. ఆరుబైట ప్రేక్షకులు కూర్చుంటాతు. అదే కథ ఒక నెల రోజులు చెప్ప వలసి వస్తే ఒక పెద్ద పందిరి వేసి దానిని చక్కగా అలంకరిస్తారు.


హరికథ లక్షణాలు


జమ్మలమడక మాధవరాయశర్మ దేవకథా కథనము లోకమున హరికథ నామముగా ప్రసిద్ధముగా ఉన్నదని నిర్వచించాడు. తంగిరాల సుబ్రహ్మణ్యశాస్త్రి హరిని కీర్తించుటయే 'హరికథ'... 'క' బ్రహ్మము, 'థ' ఉండునది. అనగా దేనియందు బ్రహ్మ ఉండునో, దేనియందు బ్రహ్మము తెలియబడునో, దేనియందు బ్రహ్మమును పొందునో దానిని కథయందురు. దీనిని గానము చేయుటయే కథాగానము... అని వివరించాడు. ఆదిభట్ల నారాయణదాసు ఇలా చెప్పాడు - ఆస్తిక్యమును, ధర్మాధర్మములను, సర్వజనమనోరంజనముగ నృత్యగీత వాద్యములతో నుపన్యసించుట హరికథ యనబరగును. అట్టి ఉపన్యాసకుడు కథకుడనబడును. దైవభక్తియు, సత్యము, భూతదయయు హరికథయందలి ముఖ్యాంశములు.

హరికథ 17వ శతాబ్దంలో మహారాష్ట్రలో అభంగ్‌గా అవతరించిందంటారు. కొందరు పండితులు యక్షగానాలే హరికథలుగా రూపాంతరం చెందాయనీ అంటారు. అయితే పరిశోధకులు వీరి అభిప్రాయంతో ఏకీభవించడంలేదు. యక్షగానాలకు, హరికథలకు మధ్య ఎన్నో తేడాలున్నాయనీ కాబట్టి రెండూ వేరని అంటారు. హరికథల్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో "కాలక్షేపాలు" అంటారు. ఆధునిక హరికథలు వెలువడక పూర్వం గోగులపాటి కూర్మనాథకవి వ్రాసిన మృత్యుంజయ విలాసం, ఓబయ్య వ్రాసిన గరుడాచల మాహాత్మ్యం మొదలైన యక్షగానాలను, మునిపల్లి సుబ్రహ్మణ్య కవి వ్రాసిన ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలను హరికథలుగా చెప్పుకొనేవారు. కానీ అవి హరికథలు కావంటారు పరిశోధకులు.


ఆధునిక ధోరణులు


గతంలో కేవలము పురుషులు మాత్రమే హరికథాగానం చేసేవారు. ప్రస్తుత కాలములో స్త్రీలు కూడ హరికథ గానం చేయడము పరిపాటియైనది. వీరికి తిరుమల-తిరుపతి దేవస్థానము వారు కూడ తమ వంతు సహకారాన్నిస్తుండడముతో హరికథా కళా కారిణులు బహుముఖముగా అభివృద్ధి చెందుతున్నారు.


సన్మానాలూ, సత్కారాలు


ఒకే రోజు కథకైతే, ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసుకు ముట్ట జెపుతారు. అదే నెలరోజుల కథలు జరిగిన తరువాత హరిదాసు ఇంటింటికీ వెళ్ళి ప్రతివారినీ కసులు కుంటాడు. నెల రోజుల పాటు మదులకు నెమ్మదిగా హరి కథను విని ముగ్దులైన ప్రజలు భక్తి ప్రవత్తులతో దాసుగారిని గౌరవించి ఎవరికి తోచింది వారు సమర్పిస్తారు. ఇలా హరి దాసు మొత్తంమీద అందరి వద్దా చేరి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకుని సంతృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా గ్రామ గ్రామాలు తిరిగి హరిదాసులు కార్యక్రమాలిస్తూ వుంటారు. మరి కొందరు ప్రతి సంవత్సరమూ వార్షికంగా ఆయా ప్రదేశాల్లో ఈ కథలు చెపుతూ వుంటారు. సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం గ్రామాల్లో ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాల ముఖ్యమైంది. ఏది ఏమైనా అనాటి నుంచి ఈనాటివరకూ శిధిలం కాకుండా నానాటికీ క్రొత్త రూపును సంత రించుకున్న కళారూపం హరికథ. 







 ఆదిభట్ల నారాయణదాసు - మరుపురాని మరికొందరు హరిదాసులు